ఆర్టికల్ టుడే, హైదరాబాద్:
హైడ్రాలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలు ఏమాత్రం తగ్గవని, గతంలో ఉన్న జీతాలే వారికి చెల్లిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇటీవల ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను క్రమబద్ధీకరిస్తూ ఒక జీవో జారీ చేయడంతో, హైడ్రాలో పనిచేసే మార్షల్స్‌లో కొంతమంది అనవసరంగా ఆందోళన చెందారని ఆయన అన్నారు. ఈ జీవో వల్ల తమ జీతాలు తగ్గిపోతాయేమోనని వారు భయపడ్డారని పేర్కొన్నారు. దీంతో కమిషనర్ సోమవారం వారితో స్వయంగా మాట్లాడి వారి అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ జీతాలు తగ్గవని, గతంలో ఉన్న జీతాలనే యథావిధిగా చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
సేవలకు అంతరాయం కలగలేదు…
హైడ్రా మార్షల్స్ ఆందోళనతో విధులు బహిష్కరించారని, హైడ్రా కార్యక్రమాలు నిలిచిపోయాయని కొన్ని ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను కమిషనర్ ఖండించారు. ఎక్కడా ఎలాంటి సేవలకు అంతరాయం కలగలేదని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ రాత్రీ పగలు కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నామని, ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనలో ఉందని ఆయన తెలిపారు. ప్రజల్లో హైడ్రాకు ఉన్న విశ్వాసం, గుర్తింపును కాపాడుకునేందుకు సిబ్బంది అందరూ కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు.
సైనికుల సేవలు మరువలేనివి…
హైడ్రాలో పని చేసే మార్షల్స్‌లో ఎక్కువ మంది సైన్యంలో పనిచేసి వచ్చినవారేనని, వారి సేవలు ఎంతో విలువైనవని కమిషనర్ పేర్కొన్నారు. వారి పట్ల హైడ్రాకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో హైడ్రా మార్షల్స్‌కు ఇక్కడి కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నట్లయితే, ఆ విధానాలను కూడా అధ్యయనం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కమిషనర్ హామీతో మార్షల్స్ సంతోషం వ్యక్తం చేశారు.