74 వర్సెస్ 42 – కూలీ, వార్ 2… బాక్సాఫీస్ వద్ద భీకర పోరు!

  • వయసు మళ్ళిన హీరోతో యంగ్ జుజుబీ
  • రజినీకాంత్ తో పోటీ పడలేకపోతున్న ఎన్టీఆర్
  • రెండు పాన్ ఇండియా సినిమాల పోటీ
  • దూసుకుపోతున్న రజినీకాంత్
  • ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల జోక్యం
  • కూలీకి కూటమి… వార్ కు వైసీపీ అండ

ఆర్టికల్ టుడే, హైదరాబాద్:
భారీ పాన్ ఇండియా చిత్రాలు కూలీ , వార్ 2 14న ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. దీంతో ఈ రెండు సినిమాల మధ్య థియేటర్ల కోసం పెద్ద పోరు నడుస్తోంది. ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎక్కువ వసూళ్లు రాబడుతుందనే విషయంపై సినీ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. తొలిరోజు ఎంత ఎక్కువ థియేటర్లలో సినిమా విడుదలయితే ఓపెనింగ్స్ అంత ఎక్కువగా ఉంటాయని, అందుకే థియేటర్ల సంఖ్య కీలకమని విశ్లేషకులు అంటున్నారు. 74 ఏళ్ల రజినీకాంత్ ముందు 42 ఏళ్ల జూనియర్ ఎన్టీఆర్ పోటీ పడలేకపోతున్నారు. తమిళనాడుకు చెందిన సినీ హీరో రజినీకాంత్… తెలుగు గడ్డపై టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ను పూచికప్పులతో తీసేస్తున్నాడు.

థియేటర్లలో టఫ్ ఫైట్…
భారతదేశంలో మొత్తం 6,877 థియేటర్లు ఉండగా… వాటిలో ఆంధ్రప్రదేశ్ 1,097 థియేటర్లతో మొదటి స్థానంలో ఉంది. తమిళనాడులో 943, కర్ణాటకలో 719, మహారాష్ట్రలో 703, తెలంగాణలో 485 థియేటర్లు ఉన్నాయి. ఈ రెండు చిత్రాల నిర్మాతలు తమ సినిమాలకు వీలైనన్ని ఎక్కువ థియేటర్లు దక్కించుకోవడానికి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంతనాలు జరుపుతున్నారు.

ముందస్తు బుకింగ్స్‌లో కూలీ హవా…
విడుదలకు మూడు రోజుల ముందుగానే బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో గణాంకాల ప్రకారం రజనీకాంత్ కూలీ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఒక మిలియన్ మార్క్‌ను దాటేసింది. కానీ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 మాత్రం ఇప్పటివరకు 66 వేల మార్క్ దగ్గరే ఉంది. కూలీ చిత్రం ఓపెనింగ్ డే బుకింగ్స్‌లో ఇప్పటికే రూ. 7.9 కోట్ల వసూళ్లను రాబట్టగా, వార్ 2 కేవలం రూ. 2.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ లెక్కల ప్రకారం ముందస్తు బుకింగ్స్‌లో కూలీ పైచేయి సాధించినట్లు స్పష్టమవుతోంది.

కూటమి, వైసీపీ ప్రచారాలు…
ఈ రెండు సినిమాల మధ్య జరుగుతున్న పోరులో రాజకీయ కోణం కూడా బయటపడింది. కూలీ సినిమా సక్సెస్ కావాలని ఏపీ మంత్రి నారా లోకేష్ పోస్ట్ పెట్టడంతో, కూటమి కూలీకి మద్దతు ఇస్తోందని ప్రచారం మొదలైంది. దీనికి పోటీగా జూనియర్ ఎన్టీఆర్‌కు మద్దతుగా వైసీపీ పార్టీ రంగంలోకి దిగుతోందని వార్తలు వస్తున్నాయి. వార్ 2కు అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెట్టాలని పార్టీ ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొదటి నుంచి వైసీపీ ఎన్టీఆర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తుందనే సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల విజయంపై రాజకీయాలు కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *