- అప్రమత్తం చేసిన రేవంత్ రెడ్డి
- స్థానిక పరిస్థితులు బట్టి స్కూళ్లకు సెలవు
- ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు
ఆర్టికల్ టుడే, హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు భారీ వర్షాలు, వరదలు ఎక్కువగా వచ్చే జిల్లాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడి, తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన సూచనలు చేశారు.
ఉద్యోగుల సెలవులు రద్దు
రాబోయే మూడు రోజులు చాలా కీలకమని, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. వారంతా 24 గంటలు అందుబాటులో ఉండి, ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు సంపదకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గంటకు 2 సెం.మీ వర్షాన్ని తట్టుకునేలా పట్టణాలు ఉన్నప్పటికీ, క్లౌడ్ బరస్ట్ లాంటి పరిస్థితుల్లో ముందస్తుగా సిద్ధంగా ఉండాలని చెప్పారు. గతంలో రెండు గంటల్లో 42 సెం.మీ వర్షం పడటం వల్ల జరిగిన నష్టాన్ని గుర్తు చేశారు.
ప్రజలను అప్రమత్తం చేయాలి
ప్రజలు వీలైనంత వరకు రోడ్ల మీదకు రాకుండా అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. హెచ్‌ఎండీఏ తరఫున ఎఫ్ఎం రేడియోలు, టీవీల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి లాంటి ప్రాంతాల్లో ఐటీ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యం కల్పించేలా ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేసే తప్పుడు సమాచారం ఇస్తున్న సంస్థలకు వెంటనే వాస్తవాలను వెల్లడించాలని ఆదేశించారు.
ప్రత్యేక హెల్ప్‌లైన్లు, నిధులు
విపత్తు నివారణ నిధులను అవసరమైన చోట వినియోగించుకోవాలని, నిధులకు ఎలాంటి కొరత లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రామీణ ప్రాంతాల కోసం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేయాలని చెప్పారు. శిథిలావస్థలో ఉన్న భవనాల విషయంలో జోనల్ కమిషనర్లు అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఆకస్మిక వరదలు సంభవిస్తే హెలికాప్టర్లతో ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో నిరంతరం సమన్వయం చేసుకోవాలని చెప్పారు.
అంతరాయాలు లేకుండా చూడాలి
విద్యుత్, తాగునీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని, మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్స్, అవసరమైతే జనరేటర్లను సిద్ధంగా ఉంచాలన్నారు. తాగునీటి సమస్యలు, పట్టణాల్లో డ్రైనేజీ సమస్యలు రాకుండా చూడాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర పరిస్థితులకు అవసరమైన మందులు, సౌకర్యాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
శాఖల సమన్వయం, ముందస్తు జాగ్రత్తలు
వరదల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ట్రాఫిక్ నియంత్రణకు సివిల్ పోలీసుల సేవలను వినియోగించుకోవాలని సీఎం చెప్పారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇవ్వాలా వద్దా అనేది స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయించాలని సూచించారు. మూసీ నది పరివాహక ప్రాంతాలు, ప్రమాదకర స్థాయికి నీరు చేరుకునే ప్రాంతాలకు ప్రజలను వెళ్లనీయకుండా పోలీసులు నియంత్రించాలని చెప్పారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి నీటి ప్రవాహంపై ఇరిగేషన్ అధికారులు పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. ఏ శాఖ కూడా తమకు సంబంధం లేదని చెప్పడానికి వీల్లేదని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక ప్రత్యేక గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని పనిచేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు.