ఆర్టికల్ టుడే, అమెరికా:
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ఆధిపత్య పోరు మరింత తీవ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, టెక్ దిగ్గజం యాపిల్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన సొంత ఏఐ స్టార్టప్ ‘ఎక్స్ఏఐ’ ఎదుగుదలను అడ్డుకోవడానికి యాపిల్, ఓపెన్ఏఐకి చెందిన చాట్‌జీపీటీకి అనైతికంగా మద్దతు ఇస్తోందని మస్క్ మండిపడ్డారు. దీనిపై న్యాయపరమైన చర్యలకు దిగుతామని మస్క్ హెచ్చరించారు.
యాంటీట్రస్ట్ నిబంధనల ఉల్లంఘన…
యాపిల్ తన యాప్ స్టోర్‌లో అనుసరిస్తున్న విధానాలపై మస్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “యాపిల్ వ్యవహరిస్తున్న తీరు వల్ల ఓపెన్ఏఐ తప్ప మరే ఇతర ఏఐ కంపెనీ యాప్ స్టోర్‌లో మొదటి స్థానానికి చేరుకోవడం అసాధ్యం. ఇది స్పష్టంగా ఏంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించడమే. దీనిపై ఎక్స్ఏఐ తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది” అని మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. యాపిల్ చిన్నపాటి పక్షపాతం చూపడం లేదని, ఏకంగా దాని బరువునంతా ఓపెన్ఏఐ వైపు మోసిందని మస్క్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెరుగుతున్న గ్రాక్, చాట్‌జీపీటీ మధ్య పోటీ
ఎలాన్ మస్క్ కంపెనీ ఎక్స్ఏఐ రూపొందించిన ‘గ్రాక్’, ఓపెన్ఏఐకి చెందిన ‘చాట్‌జీపీటీ’ మధ్య పోటీ తీవ్రమవుతున్న సమయంలో ఈ ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గత నెలలో ఎక్స్ఏఐ ‘గ్రాక్ 4’ను విడుదల చేసింది. దీంతో యాపిల్ ప్రొడక్టివిటీ కేటగిరీలో గ్రాక్ ర్యాంకు 60 నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. అయితే, చాట్‌జీపీటీ గత ఏడాదిగా యాపిల్ యాప్ స్టోర్ ఓవరాల్ చార్టుల్లో మొదటి లేదా రెండో స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది. సిరి, ఇతర రైటింగ్ టూల్స్‌లో ఓపెన్ఏఐ సాంకేతికతను వాడటంతో పాటు, యాప్ స్టోర్‌లో చాట్‌జీపీటీని ప్రత్యేకంగా హైలైట్ చేయడమే దీనికి కారణమని మస్క్ ఆరోపిస్తున్నారు.